అక్షరాలే సాక్ష్యాలుగా మార్క్స్‌ ఏంగెల్స్‌ జీవితాలు

కారల్‌ మార్క్స్‌ ఏంగెల్స్‌లు మొదటిసారి నవంబరు 1842లో కొలోన్‌లో కలిశారు. వారిద్దరి మధ్య సైద్ధాంతిక సహవాసం మాత్రం 1844 నుండే మొదలైంది. 1849లో యూరోపియన్‌ విప్లవ వెల్లువ వెనకపట్టు పట్టడంతో మార్క్స్‌ ఇంగ్లాండ్‌కు వలస పోవాల్సి వచ్చింది. ఏంగెల్స్‌ కూడా మార్క్స్‌తో పాటే ఇంగ్లాండ్‌ చేరారు. మార్క్స్‌ లాడ్జింగ్‌లలో తలదాచుకుంటే ఏంగెల్స్‌ అక్కడికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మాంచెస్టర్‌లో కుటుంబ యాజమాన్యంలో ఉన్న నూలుమిల్లు నడిపే బాధ్యతలు తీసుకున్నారు. 1850 నుండి 1870 వరకూ నూలు మిల్లు బాధ్యతల్లో ఉన్నప్పటికీ ఏంగెల్స్‌ మార్క్స్‌ల మధ్య సైద్ధాంతిక బంధం గాఢంగా పెనవేసుకుపోయింది. ఇద్దరూ ఏ చిన్న అంశంపై రాసినా పరస్పరం పంచుకుని సరి చూసుకునేవాళ్లు. నాటి ప్రపంచ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలో లోతుగా చర్చించుకునే వాళ్లు. ఇలాంటి చర్చల కోసం వారిరువరూ రాసుకున్న లేఖలు వేల సంఖ్యలో ఉన్నాయంటే ఇద్దరి మధ్య జరిగిన సైద్ధాంతిక సంభాషణ ఏ స్థాయిలో, ఏ తీవ్రతతో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ రెండు దశాబ్దాల కాలంలో ఇద్దరి మధ్యా రెండున్నర వేల లేఖలు నడిచాయి. మరో 1500 లేఖలు సమకాలీన విప్లవకారులు, సోషలిస్టులు, కార్మిక నాయకులు, మొదటి ఇంటర్నేషనల్‌ సభ్యులకు రాసిన లేఖలు ఉన్నాయి. వీటికి తోడు మార్క్స్‌ ఏంగెల్స్‌ అందుకున్న మరో 10,000 లేఖలు ఉండనే ఉన్నాయి. అదనంగా మరో ఆరువేల లేఖలు లెక్క తేలుతున్నప్పటికీ అవి ఎక్కడ ఏ స్థితిలో ఉన్నాయో తెలియరాలేదు. ఈ లేఖలు అద్భుతమైన చరిత్రకు ఆరంభాలు. ఆయా లేఖల్లో చర్చకు పెట్టిన అనేక సైద్ధాంతిక అంశాలను మార్క్స్‌ ఏంగెల్స్‌లు తర్వాతి కాలంలో పరిపూర్ణంగా అభివృద్ధి చేసి ఉండలేకపోవచ్చు. కానీ అందులో ఉన్న వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రపంచానికి ఉంది. ఇద్దరు కమ్యూనిస్టు యోధుల కలాల నుండి జాలువారిన 19వ శతాబ్ది సాహిత్య ప్రస్తావనలు పరిశీలిస్తే ఇద్దరికీ ఆర్థిక రాజకీయ అంశాలతో పాటు సామాజిక సాంస్కృతిక, చారిత్రక అంశాలపై కూడా ఎంతటి పట్టు ఉందో అర్థమవుతుంది.
మార్క్స్‌ ఎనిమిది భాషల్లో ప్రావీణ్యం సంపాదిస్తే ఏంగెల్స్‌కు 12 భాషల్లో పట్టు ఉండేది. ప్రాచీనమైన లాటిన్‌ గ్రీకు భాషల్లో కూడా మార్క్స్‌ ఏంగెల్స్‌లు లేఖలు రాశారంటే వాళ్లకున్న సామర్ధ్యం తేటతెల్లమవుతుంది. మానవాళి ఉద్ధరణకు కంకంణం కట్టుకున్న ఇద్దరూ సాహిత్య ప్రఖండులే. ప్రవీణులే. షేక్స్‌పియర్‌ నాటకాలు మార్క్స్‌కు కంఠతా వచ్చు. ఎఖిలస్‌, డాంటే, బాల్జాక్‌ రచనలు పిలిస్తే పలికేవి. మాంచస్టర్‌ కేంద్రంగా పని చేసే షిల్లర్‌ ఇనిస్టిట్యూట్‌కు ఏంగెల్స్‌ దీర్ఘకాలం అధ్యక్షుడుగా ఉన్నాడు. అరిస్టాటిల్‌, గోధె, లీసింగ్‌ల రచనలు నాలికమీద ఉండేవి. విశ్వ విప్లవం సాధ్యాసాధ్యాల గురించిన చర్చతో పాటు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, ఉత్తర ప్రత్యుత్తరాల్లో సమకాలీన శాస్త్ర పరిజ్ఞానం, సాంకేతిక అభివృద్ధి, భూగోళ శాస్త్రం, భౌకతి రసాయన శాస్త్రాల్లో ఆవిష్కృతమవుతున్న పురోగతి, గణితం, మానవ పరిణామ శాస్త్రం గురించిన వివరాలెన్నో వీనులవిందు చేస్తాయి. ఏ విషయం కోసమైనా మార్క్స్‌ ఆధారపడగల ఏకైక వ్యక్తిగా ఏంగెల్స్‌ నిలిచాడు. మార్క్స్‌ ఏ సందర్భంలో ఏ రకమైన సమస్య, ప్రశ్న, మీమాసం ఎదుర్కొన్నా ఆయన పలకరించే మొదటి వ్యక్తి ఏంగెల్స్‌.
వారిద్దరి మధ్య ఉన్నది కేవలం మేధో సంబంధం మాత్రమే కాదు. అద్వితీయమైన మానవ సంబంధం. స్నేహ బంధం. ఏంగెల్స్‌తో చెప్పుకోని సమస్యంటూ మార్క్స్‌కు లేదు. కుటుంబ ఆర్థిక అవసరాల విషయంలో ఎదురవుతున్న విషమ పరిస్థితులు మొదలు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు, రాగద్వేషాలు అన్నింటినీ ఏంగెల్స్‌తో చర్చించేవాడు మార్క్స్‌. మార్క్స్‌ అవసరాలు తీర్చటానికి ఏంగెల్స్‌ తనను తాను మర్చిపోయి మరీ ప్రయత్నం చేశాడు. ఏ కొద్దిపాటి సాయం అందించగలిగినా వెనకంజ వేయలేదు. ఈ విధంగా మార్క్స్‌కు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన పెట్టుబడి గ్రంథాన్ని పూర్తి చేయటానికి తెరవెనక నుండి ఏంగెల్స్‌ అందించిన సహాయం వెలకట్టలేనిది. మర్చిపోలేనిది. 1867 ఆగస్టులో పెట్టుబడి గ్రంథం తొలి సంపుటాన్ని పూర్తి చేసిన ఓ రాత్రి ఏంగెల్స్‌ను గుర్తు చేసుకుంటూ ”నీకు అన్ని రకాలుగా కృతజ్ఞుడిని. నీవు లేకపోతే పెట్టు బడి గ్రంథం పూర్తయ్యేదే కాదు” అని రాశారు.
మొదటి కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ దైనందిన వ్యవహారాల్లో 1864 నుంచీ మార్క్స్‌ దిగబడిపోవటం వలన ఈ గ్రంథం మరింత ఆలస్యమైంది. కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ ఏర్పాటు, నిర్మాణం, నిర్వహణలో కీలక నాయకత్వ భారం మార్క్స్‌దే అయినా ఏంగెల్స్‌ కూడా తనకున్న అన్ని శక్తి సామర్ధ్యాలు, నైపుణ్యాలు దీనికోసం వెచ్చించారు. మార్చి 18, 1871 రాత్రి తాము ఊహించిన ఆశాసౌధం పారిస్‌ కమ్యూన్‌ రూపంలో ఆవిష్కృతమైందని, సోషలిస్టు సమాజ నిర్మాణం దిశగా తొలి అడుగులు పడ్డాయన్న వార్త విన్నప్పుడు తాము ఊహించినదానికంటే సమాజం వేగంగానే మారుతోందని గుర్తించారు.
జెన్నీ 1881లో మరణించిన తర్వాత మరింత దిగజారిపోయిన మార్క్స్‌ ఆరోగ్యాన్ని కుదుటపర్చటానికి లండన్‌కు దూరంగా బస చేయించాలని డాక్టర్లు సలహా ఇచ్చినప్పుడు కూడా మార్క్స్‌ ఏంగెల్స్‌ల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఎన్నడూ ఆగలేదు. రకరకాల సందర్బాల్లో ఇద్దరినీ రకరకాల పేర్లతో ప్రవాస కార్మికవర్గ నాయకులు పిలుస్తూ ఉండేవారు. సైనిక శాస్త్రంలో ఏంగెల్స్‌కున్న ప్రావీణ్యం రీత్యా ఆయన్ను జనరల్‌ అని, మార్క్స్‌ గడ్డం, జుట్టు, ఇంగ్లీషు వేషధారణ రీత్యా ఆయన్ను మూర్‌ అని మొదటి ఇంటర్నేషనల్‌ కార్యవర్గ సభ్యులు పిలుచుకునేవారు. మార్క్స్‌ కొద్దిరోజుల్లో చనిపోతాడనా కూతురు ఎలెనార్‌ను పిలిచి ‘ఆ అసంపూర్ణంగా మిగిలిన రాతప్రతులను ఏదో ఒకటి చేయమని చెప్పు ఏంగెల్స్‌కు ” అంటారు
మార్క్స్‌. 1883 మార్చిలో ఓ మద్యాహ్నవేళ మార్క్స్‌ను కలిసిన ఏంగెల్స్‌ మార్క్స్‌ ఆఖరి కోరికకు విలువనిచ్చి అసంపూర్ణంగా మిగిలిన పెట్టుబడి రెండు, మూడు సంపుటాలను సంస్కరించి ప్రచురించే యజ్ఞాన్ని చేపట్టారు. అదే మార్క్స్‌ను ఏంగెల్స్‌ ఆఖరిసారి ప్రత్యక్షంగా కలుసుకోవటం. మార్క్స్‌ మరణించిన తర్వాత ఏంగెల్స్‌ మరో పుష్కరకాలం జీవించి ఉన్నారు. ఈ కాలంలో ప్రధాన సమయాన్ని పెట్టుబడి గ్రంథం పూర్తి చేసి అచ్చుకు సిద్ధం చేయటానికే వెచ్చించారు ఏంగెల్స్‌.
తన జీవితం చివరి దశాబ్దంలో మార్క్స్‌తో కలిసి చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలతో సహా అనేక పనులను చేయలేకపోయానని ఏంగెల్స్‌ బాధపడ్డారు. మార్క్స్‌ మరణానంతరం ఇద్దరి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఓ వరుస క్రమంలో అమరుస్తున్న ఏంగెల్స్‌ నోట్లో సిగరెట్‌ పైపుతో అర్థరాత్రి దాటిన తర్వాత మేజా బల్ల మీద లేఖలు రాస్తూ కూర్చున్న మార్క్స్‌ను గుర్తు చేసుకుంటారు. ఈ లేఖలను భద్రపర్చే క్రమంలో తరచూ ఏంగెల్స్‌ మార్క్స్‌తో ముచ్చటించిన విషయాలు, చిరాకుపడ్డ సందర్భాలు, మనాసారా నవ్వుకున్న చర్చలు, చేజారిన విప్లవ అవకాశాలను మదింపు వేస్తూ రేపటి విప్లవం ఎప్పుడు ఎక్కడ అంటూ సాగించిన మేధోమధనాలతో ఏంగెల్స్‌ జ్ఞాపకాల పొరలు రెక్కలు విచ్చుకుంటున్న పక్షుల్లా కిలకిలా రావాలు చేసేవి. ఎంత భావోద్వేగానికి లోనైనా నిద్రాణంగా ఉన్న కోట్లాదిమంది శ్రమ జీవులు దిక్కులు పిక్కటిల్లేలా రంకెలు వేస్తూ పెట్టుబడిదారీ వ్యవస్థ సౌధాన్ని కుప్పకూల్చను న్నారన్న విషయంలో ఏ నాడూ విశ్వాసాన్ని కోల్పోలేదు.

Published in:

Nava Telangana

Pub Info:

5 May, 2022

Available in: