Veeraiah Konduri, Telugadda

Review of The Last Years of Karl Marx: An Intellectual Biography

Karal Marx: మార్సెల్లో ముస్టో రచించచిన కారల్‌ మార్క్స్‌ చివరి సంవత్సరాలు : మేధో జీవిత చరిత్ర గ్రంధం ప్రధానంగా ఇప్పటి వరకూ పరిశోధనకు, పరిశీలనకు అందుబాటులోకి రాని సమాచారాన్ని విశ్లేషించే రచన. ఈ రచన మార్క్స్‌ మేధో జీవితం, వ్యక్తిగత జీవితాలను లోతుగా పరిశీలిస్తోంది. దీనికి గాను ఉపయోగించిన సమాచారం ప్రధానంగా 1998లో మార్క్స్‌ సర్వ సమగ్ర రచనల ప్రాజెక్టు పేరుతో సాగుతున్న పరిశోధనల నుండి సేకరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికి 114 సంపుటాలు అందుబాటులోకి వచ్చాయి.

మార్క్స్‌ జీవితంలో చివరి దశ కష్టాలు కడగండ్లతో నిండి ఉంటుంది. ఈ కాలంలోనే మార్క్స్‌ కూతురు ఎలినార్‌ తీవ్రమైన మనోవ్యాధికి లోనవుతుంది. (1898లో ఆత్మహత్య చేసుకుంటుంది). అత్యంత ప్రియ సఖి, జీవిత సహచరి జెన్నీ కాలం చేస్తుంది. జెన్నీ ముఖం తలచుకున్నప్పుడల్లా మధురమైన జ్ఞాపకాలు వరదలై కళ్లు చమరుస్తాయని మార్క్స్‌ ఓ సందర్భంలో చెప్పుకున్నారు. తొలి సంతానం జెన్నీ కరోలిన్‌ కూడా ఈ కాలంలోనే చనిపోతుంది. ఈ సమయంలో బయటపడిన ఊపిరితిత్తుల వ్యాధి జీవితాంతం ఆయన్ను వెంటాడుతూ వచ్చింది. అనేక రూపాల్లో ఆయన పని ముందుకు సాగకుండా ఆటంకపర్చింది. ఈ స్థాయిలో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఏ వ్యక్తికైనా తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేయటయం అసాధ్యం. మార్క్స్‌ కూడా ఓ వైపు అప్పుడే అంకుర దశలో ఉన్న అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమానికి దిశా నిర్దేశం చేస్తూ మరోవైపు కుటుంబ సమస్యలతో సతమతమౌవటంతో తాను నిర్దేశించుకున్న అనేక మేధో లక్ష్యాలను పూర్తి చేయటంలో విఫలమయ్యారు. తన అధ్యయనాలన్నింటికీ తలమానికంగా ఉన్న పెట్టుబడి గ్రంధం రెండో సంపుటి, మూడో సంపుటిని కూడా అచ్చుకు సిద్ధం చేయలేకపోయారు.

ప్రపంచ కమ్యూనిస్టు విప్లవ వ్యూహరచయితగా కొనియాడబడుతున్న కారల్‌ మార్క్స్‌కు అత్యంత ఆహ్లాదకరమైన సమయం ఏమిటో తెలుసుకుంటే ఒకింత ఆశ్చర్యం కలగకమానదు. తాను మనమళ్లు, మనుమరాండ్రుతో గడిపిన కొన్ని క్షణాలు, జర్మన్‌ సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులు కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్‌కు పోటీ చేస్తే మూడువందలకు పైగా ఓట్లు సాధించటం వంటి సందర్భాలు ఆయన మనసును తేలికపరిచి తిరిగి ఉత్సాహపరిచేవి. జీవితం చివరి నాళ్లలో మార్క్స్‌కు గణితశాస్త్రం పట్ల కలిగిన ఆసక్తి, దానికోసం ఆయన వెచ్చించిన సమయం పరిశీలకులను ఆశ్చర్యపరుస్తుంది. పాల్‌ లాఫార్గ్‌ మాటల్లో ‘‘ఆయన ప్రాణానికి ప్రాణంతో సమానమైన జెన్నీ అనారోగ్యంతో మంచానపడ్డప్పుడు కలిగిన దు:ఖం నుండి మార్క్స్‌నను బయటపడేసిన ఏకైక అంశం గణితశాస్త్ర అధ్యయనం.’’ నేడు గ్రండ్రిస్‌గా పిలవబడుతున్న ఏడు నోట్సులు రాసుకునే సమయంలో మార్క్స్‌ గుర్తించిన కొన్ని లోపాలను సరిచేసుకోవటానికి ఆల్జీబ్రా అధ్యయనంతో మొదలైన గణితం పట్ల ఆసక్తి ఆయనకు అత్యంత క్లిష్టకాలంలో మనసులను తేలికపర్చిన వ్యాపకంగా మారింది.

పేవలమైన ఆరోగ్యంతో కుస్తీపడుతూనే మార్క్స్‌ అమెరికా, భారత దేశం, రష్యా, యూరప్‌లో సాగుతున్న రాజకీయ పోరాటాల మొదలు ఆర్థికరంగం, ఆల్జీబ్రా, కలనగణితం, మానవపరిణామ శాస్త్రం, చరిత్ర, భూగర్భశాస్త్రం, వ్యవసాయక రసాయన శాస్త్రం, ఖనిజశాస్త్రం వంటి అనేక అంశాలపై సాధికారిక అంచనాకు రావడానికి ఉపకరించే నోట్సులు తయారు చేసుకున్నారు. లోతైన పరిశోధనలు సాగించారు. సాధారణంగా మార్క్స్‌ అధ్యయనాలు యూరప్‌కు, ఆర్థిక వ్యవస్థకు, వర్గపోరాటాలకు, ఆర్థిక నియతివాదానికి పరిమితమయ్యాడని, వలసవాద పక్షపాతిగా ఉన్నాడని కొందరు మేధావులు మార్క్స్‌ ను కించపరిచేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ముస్టో రచన మార్క్స్‌ పరిశోధనా ప్రపంచం నిజమైన ప్రపంచమంత విస్తృతి కలిగిదనీ, ఆయన్ను వర్గ పోరాటానికో, ఆర్థిక నియతివాదానికో, యూరప్‌కో పరిమితం చేయటం ఆయన్ను అపార్థం చేసుకోవటమేనని ధృవీకరిస్తుంది.

1972లో లారెన్స్‌ క్రేడర్‌ ఎథ్నొలాజికల్‌ నోట్‌బుక్స్‌ ఆఫ్‌ కారల్‌ మార్క్స్‌ అనే ప్రసిద్ధ గ్రంధాన్ని మార్క్సిస్టు అధ్యయనకారుల ముందుకు తెచ్చారు. ఈ రచనలో మౌలికంగా మోర్గాన్‌ పురాతన సమాజం, హెన్రీ సమ్మర్‌ మెయిన్‌ రచించిన ఎర్లీ హిస్టరీ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌, జాన్‌ లుబ్బాక్‌ రచించిన ఆరిజిన్స్‌ ఆఫ్‌ సివిలైజేషన్‌, జెపి పియర్స్‌ రాసిన ఆర్యన్‌ విలేజ్‌ వంటి గ్రంధాల నుండి విస్తారంగా సేకరించిన నోట్సును విశ్లేషిస్తారు క్రేడర్‌. ఇందులో మోర్గాన్‌ పురాతన సమాజం అత్యంత ప్రాధాన్యత కలిగిన రచన. మోర్గాన్‌ రచన చదివిన తర్వాతనే కుటుంబం గురించిన మార్క్స్‌ అవగాహన మారిందని ముస్టో వివరిస్తారు. రాజ్యం ఆవరతరణ, సమాజాన్ని అదుపులో ఉంచటంలో దాని పాత్ర గురించి 1843 నుండీ మార్క్స్‌ తాజాపర్చుకుంటూ వచ్చిన అభిప్రయాలను కూడా మోర్గాన్‌ రచన ధృవీకరిస్తుందని ముస్టో ప్రస్తావిస్తారు. మోర్గాన్‌ రాసిన పురాతన సమాజంతో పాటు సమకాలీన మానవజాతి పరిణామ శాస్త్రవేత్తల రచనలను అధ్యయనం చేయటంతో పాటు మోర్గాన్‌ గురించి మార్క్స్‌ రాసుకున్న నోట్స్‌లో కొంత భాగాన్ని సేకరించి ఏంగెల్స్‌ తర్వాతి కాలంలో కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాంగాల పుట్టుక అన్న ప్రామాణిక మార్క్సిస్టు రచనను మనముందుంచారు. ఈ గ్రంధం చారిత్రక భౌతికవాద సిద్ధాంతాన్ని సమాజానికి, సమాజ పరిణామ చరిత్రకు అన్వయించి మార్క్స్‌ నిర్ధారణల వాస్తవికతను చరిత్ర ధృవీకరించిందని రుజువు చేస్తుంది.
ఇప్పటి వరకూ అందుబాటులోకి వచ్చిన మార్క్స్‌ రచనల్లో సరైన ప్రాధాన్యతకు నోచుకోని రచన మాక్సిమ్‌ కొవెలవెస్కీ రచించిన ఉమ్మడి భూయాజమాన్యం అన్న రచనపై మార్స్‌ పరిశీలనలు. దశాబ్దం క్రితం వరకూ నెదర్లాండ్స్‌లోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ హిస్టరీ గ్రంధాలయానికి ప్రత్యక్షంగా వెళ్లి అక్కడి అల్మారాల్లో నిక్షిప్తం చేసిన పత్రాలను చదవగలిగిన వారికి మాత్రమే ఈ విషయాలు తెలిసే అవకాశం ఉండటంతో వీటి గురించిన సమాచారం బయటి ప్రపంచానికి అంతగా తెలియరాలేదు. ఈ విషయాలను తొలిసారిగా ప్రపంచం దృష్టికి తెచ్చిన రచన స్పానిష్‌ రచన ప్రాచీన సమాజం గురించి కారల్‌ మార్క్స్‌ రచనలు అన్న శీర్షికతో వచ్చిన రచన. ఈ రచనలోనే కొవెలవెస్కీ రచన గురించి మార్క్స్‌ సేకరించిన సమచారాన్ని తొలిసారిగా వెలుగులోకి తెచ్చారు ఈ నోట్స్‌లో కొలంబస్‌ అమెరికాను కనుగొన ముందున్న స్తానిక నాగరికతలు, ప్రాచీన భారతీయ నాగరికతలను మార్క్స్‌ ప్రశంసిస్తూనే కొవెలవెస్కీ వర్గీకరణను ప్రశ్నిస్తారు మార్క్స్‌. రెండు వేర్వేరు నాగరికత పరిణామాలను ఒకటిగానే భావించారని కొవెలవెస్కీని మార్క్స్‌ విమర్శిస్తారు. పూర్తిగా వేర్వేఉ చారిత్రక సందర్భాలు, భౌగోళిక పరిస్థితులు, నేపథ్యాల్లో ఉనికిలోకి వచ్చిన వ్యవస్థలు, సంస్థలను ఒకేమాదిరిగా సమానార్ధకాలుగా పరిగణించటం పట్ల మార్క్స్‌ అభ్యంతరం తెలుపుతారని ముస్టో ఈ గ్రంధంలో గుర్తు చేస్తారు.

మార్క్స్‌ రచల్లో లూయీ బోనపార్టీ, గోథా కార్యక్రమ విమర్శ, ఫ్రాన్స్‌ లో వర్గ పోరాటాలు మౌలికంగా రాజకీయ వ్యాఖ్యానాలుగా పరిగణిస్తుంటాము. ఈ మూడు రచనలు కూడా చదవకుండా మార్క్సిస్టు రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్న వారు కూడా లేకపోలేదు. ముస్టో తన తాజా రచన ద్వారా మార్క్స్‌ రాజకీయ వ్యాఖ్యానాలు ఈ మూడిరటికే పరిమితం కాదని గుర్తు చేస్తారు. జర్మనీ, ఫ్రాన్స్‌, రష్యాల్లోని రాజకీయ ఉద్యమాలలో మార్క్స్‌ పాత్రను, ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తారు ముస్టో. 1880లో ఫ్రాన్స్‌కు చెందిన సోషలిస్టు వర్కర్స్‌ పార్టీ ఎన్నికల కార్యక్రమాన్ని రూపొందించటంలో మార్క్స్‌ పాత్ర గురించి ముస్టో తన రచనలో విశేషంగా ప్రస్తావిస్తారు. ఈ కార్య్కకమాన్ని రూపొందింటంలో భాగంగా ఫ్రాన్స్‌లోని కార్మికుల స్థితిగతులను, వేతనాలు, భత్యాలు, ఆర్థిక సామాజిక స్థితిగతులు గురించి అధ్యయనం చేయటానికి మార్క్స్‌ స్వయంగా 101 ప్రశ్నలు రూపొందించారన్న చారిత్రకవాస్తవాన్ని ముస్టో రచన ద్వారా తెలుసుకోవచ్చు. ఈ కోవకు చెందినదే అమెరికాకు ఆర్థికవేత్త హెన్రీ జార్జి మీద మార్క్స్‌ సంధించిన విమర్శ. కాలిఫోర్నియా వర్కర్స్‌ పార్టీకి గురించి, భారతదేశంలో వలసపానల పర్యవసానాల గురించి, ఐర్లాండ్‌ స్వాతంత్య్ర పోరాటం గురించి మార్క్స్‌ ప్రసంగాలు, రచనలు, వ్యాఖ్యానాలు అధ్యయనం చేస్తేనే మార్క్స్‌ సంపూర్ణ రాజకీయ దృక్ఫధం అర్థం చేసుకోవటం సాధ్యమవుతుందని ముస్టో స్పష్టం చేస్తున్నారు. వీటన్నింటిని అధ్యయనం చేసేటప్పుడు ఆయా పోరాటాలకు నేపథ్యంగా ఉన్న నిర్దిష్ట పరిస్థితుల గురించి కూడా మార్క్స్‌ నిర్దిష్ట పరిశీలనకు ఓపిగ్గా ప్రయత్నం చేసారే తప్ప ఒకటో అరో పరిశీలించి వాటి ఆధారంగా సార్వత్రిక నిర్ధారణలకు రాలేదన్నది ముస్టో మనకు ఈ రచన ద్వారా గుర్తు చేస్తున్న ముఖ్యమైన అంశం. మార్క్స్‌ ఈ అధ్యయన పద్ధతినే తర్వాతి కాలంలో లెనిన్‌ నిర్దిష్ట పరిస్థితుల నిర్ధిష్ట అధ్యయనం అని పిలిచిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు.

జారిస్టు రష్యాలో జరుగుతున్న మార్పులను స్వయంగా అర్థం చేసుకోవటానికి రష్యన్‌ రచనలు చదవటానికి వీలుగా 1869లో రష్యా భాష నేర్చుకోవటానికి మార్క్స్‌ ఉపక్రమించటాన్ని ముస్టో ప్రస్తావిస్తారు. 1870 దశకమంతా మార్క్స్‌ రష్యా వ్యవసాయక స్థితిగతులను అధ్యయనం చేయటానికి వెచ్చిస్తారు. 1876లో డ్యూరింగ్‌ రచనకు సమాధానం రాయాలని మార్క్స్‌ ఏంగెల్స్‌ను ప్రోత్సహిస్తారు. దీనికి సమాధానంగా ఏంగెల్స్‌ నవ్వుతూ ‘‘ నువ్వు మాత్రం వెచ్చటి కంబళి కప్పుకుని విరామం లేకుండా రష్యాలో వ్యవసాయక స్థితిగుతుల గురించి ప్రత్యేకంగా కౌలు గురించి చదువుతూ నన్నేమో నా చేతిలో ఉన్న పనులన్నీ పక్కన పెట్టి ఓ చెక్క కుర్చీలో కూర్చుకుని వెచ్చదనం కోసం వైన్‌ తాగుతూ డ్యూరింగ్‌ తలకాయ నుజ్జు నుజ్జు చేయటానికి పూనుకొమ్మని పురమాయిస్తావా’’ అంటారు. తామిద్దరూ పంచుకున్న సైద్ధాంతిక కృషి కర్తవ్యాల గురించి ఈ సంభాషణ గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు. రష్యాకు చెందిన నికొలాయ్‌ చెరెన్క్సీని మార్క్స్‌ ఎంతో ప్రామాణికంగా పరిగణిస్తారు. పందొమ్మిదో శతాబ్దం చివర్లో చెరెన్క్సీ సమకాలీన రష్యా సామాజిక జీవన వాస్తవికతను ప్రతిబింబిస్తూ ఏమి చేయాలి అన్న సాంఘిక నవల రాస్తారు. ఈ శీర్షికనే తర్వాతి కాలంలో పార్టీ నిర్మాణం ప్రాధాన్యత గురించి రాసిన తన గ్రంధానికి లెనిన్‌ శీర్షికగా ఎంచుకుంటారు. యూరప్‌లో చెరెన్క్సీని, ఆయన రచనలను, కృషి పరిచయటం చేయటానికి వీలుగా ఆయన గురించి సంక్షిప్త పరిచయాన్ని విడుడల చేసేందుకు సిద్ధమయ్యారంటే మార్క్స్‌ చెరెన్క్సీ రచనలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఓ భాగం పెట్టుబడిదారీ దశలోకి ప్రవేశించకుండానే తదనంతర దశకు ప్రయాణించగలదన్న అంచనాకు మార్క్స్‌ రావటానికి చెరెన్క్సీ రచనల ప్రభావం ఉందంటారు.

చెరెన్క్సీ మాటల్లో ఓ దేశం తన అభివృద్ధి పథంలో నిర్దిష్ట ఆధునిక దశకు చేరుకున్నప్పుడు పొరుగునున్న మరో వెనకబడిన దేశం అదే దశకు చేరటానికి సదరు దేశం ప్రయాణించిన మార్గంలోనే ప్రయాణించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఆ దశకు చేరటానికి మరో దగ్గరి మార్గాన్ని ఎంచుకోవచ్చు. అభివృద్ధి చెందిన దేశం, వెనకబడిన దేశానికి మధ్య ఏర్పడే బహుళసంబంధాలు ఈ మార్గాన్ని ఏర్పాటు చేస్తాయన్నది చెరెన్క్సీ అంచనాగా ఉండేది. ఈ విషయాన్ని వివరించటానికి అమ్మమ్మ తన పెద్ద మనుమలకు మాంసం బొమికలు ఇచ్చి చిన్న మనుమడికి అందులోని మూలిగను ఇస్తుంది అన్న ఉదాహరణను ప్రస్తావిస్తారు చెరెన్క్సీ. ఈ సందర్భంలోనే మార్క్స్‌ గురించిన ఓ ఆసక్తికరమైన సందర్భాన్ని ముస్టో ఈ రచన ద్వారా మనముందుంచుతారు. అప్పటికే రష్యా భాషలో కమ్యూనిస్టు ప్రణాళిక అనువాదం, పెట్టుబడి గ్రంధం తొలి సంపుటి అనువాదం అందుబాటులోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే రష్యాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి గురించి దేశంలోని వివిధ విప్లవ బృందాల మధ్య మేధో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధవంలోని రష్యాలోని ఉదారవాద బూర్జువా మేధావులు కూడా ప్రవేశిస్తారు. నికొలాయ్‌ మిఖాయిలొవిస్కీ అటువంటి ఉదారవాద బూర్జువా మేధాల్లో ఒకరు. రష్యాలోని విప్లవ బృందాలను గేలి చేస్తూ ఆయన ‘‘రష్యాలోని మార్క్స్‌ అనుయాయులు గట్టు మీద కూర్చుని చూస్తూ ఉండాల్సిందే…రష్యాలో మార్క్స్‌ సూత్రాలు ఆచరణరూపం దాల్చాలంటే ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తి సాధనాలను కోల్పోయే వరకూ ఎదురు చూస్తూ ఉండాల్సిందే.’’ అని విమర్శిస్తారు. దీనికి స్పందిస్తూ వీరా జెసూలిక్‌ అనే రష్యా విప్లవకారిణి మార్క్స్‌ రష్యా విముక్తి మార్గం గురించి మార్క్స్‌ ఏమి ఆలోచిస్తున్నారో తెలియచేయాలని లేఖ రాస్తుంది. ఆమె లేఖకు సమాధానంగా మార్క్స్‌ రష్యా పెట్టుబడిదారీ దశకు చేరకుండానే సోషలిస్టు విప్లవాన్ని సాధించే అవకాశం ఉందని చెప్తారు. అయితే ఈ లేఖను ఆయన జెసూలిక్‌కు పోస్టు చేయలేదు. తాజాగా మార్క్స్‌ గురించి సాగుతున్న అధ్యయనాలు ఈ లేఖ వృత్తాంతాన్ని ముందుకు తెచ్చాయని ముస్టో చెప్తారు.
ఈ విధంగా ఇప్పటి వరకూ మార్క్సిస్టు అధ్యయనకారులకు, పరిశోధకులకు, అనుయాయులకు అందుబాటులో లేని అనేక విషయాలను ముస్టో తన తాజా రచన ద్వారా మనముందుకు తెస్తారు. కారల్‌ మార్క్స్‌ వర్ధంతి సందర్భంగా మరుగునడిప విలువైన మార్క్సిస్టు సారస్వతాన్ని పాఠకుల దృష్టికి తేవటానికి విశేష కృషి చేస్తున్న మెగా2 ప్రాజెక్టు నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్పక తప్పదు.

-కొండూరి వీరయ్య

(కారల్ మార్క్స్ వర్ధంతి సందర్బంగా తెలుగడ్డా పాఠకులకు ప్రత్యేకం – ఎడిటర్)

Published in:

Telugadda

Date Published

14 March, 2022

Author:

Veeraiah Konduri